Job Update Posted on June 11, 2026, 3:33 am

433 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి

ఎంపిక జాబితా వెల్లడించిన వైద్యారోగ్య నియామక మండలి

🍥వైద్యవిద్య డైరెక్టరేట్‌ పరిధి ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని స్పెషాలిటీ, సూపర్‌స్పెషాలిటీ విభాగాల్లో 433 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వైద్య, ఆరోగ్య సర్వీసుల నియామక మండలి బుధవారం విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్యకళాశాలల్లోని 34 విభాగాల్లో 607 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో అనస్తీషియా, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్‌ విభాగాలకు చెందిన 174 పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. మిగిలిన 30 విభాగాల్లో 433 పోస్టులకు సంబంధించి ఎంపిక జాబితా తాజాగా వెల్లడైంది. వీటితోపాటు నాలుగు స్పీచ్‌ పథాలజిస్టు పోస్టులకు ఎంపికైన వారి వివరాలూ వెల్లడయ్యాయి.

💥రెండున్నరేళ్లలో 15వేల పోస్టుల భర్తీ: మంత్రి దామోదర్‌ రాజనర్సింహ

🌀వైద్యఆరోగ్యశాఖలో గత రెండున్నరేళ్లలో 15 వేల పోస్టులను భర్తీ చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఈ సందర్భంగా వెల్లడించారు. ఉద్యోగాలకు ఎంపికైన అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, స్పీచ్‌ పథాలజిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే వారికి నియామక పత్రాలు అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రులు, ఇతర ఆరోగ్య సంస్థల్లో మానవ వనరులను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టిసారించిందని వివరించారు. కొత్త నియామకాలతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవల్లో నాణ్యత పెరుగుతుందని, ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.
Share this:
Ambati Net World

Your trusted destination for the latest job updates, career opportunities, and government schemes.